చర్చ, కరీంనగర్: సమ్మక్క- సారలమ్మ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు

- అధికారులు సమన్వయంతో పనిచేయాలి
- సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
రాబోయే జనవరి 28 నుండి 31వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించనున్న సమ్మక్క సారలమ్మ జాతరకు పకడ్బందీ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కాన్ఫరెన్స్లో సమ్మక్క జాతర ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో సమ్మక్క సారలమ్మ జాతర జరిగే ప్రదేశాల్లో అధికారులంతా సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. జాతర ప్రదేశాల్లో వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలం కేటాయించాలని, హైమాస్ లైట్,లు భారీకేడ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక మరుగుదొడ్లను నిర్మించాలని సూచించారు. గ్రామీణ నీటి సరఫరా అధికారులు జాతర ప్రాంతాల్లో నీటి వసతి కల్పించాలని తెలిపారు. జాతర పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఇప్పటికప్పుడు చెత్తాచెదారం సేకరించాలని మునిసిపల్, గ్రామపంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. తాత్కాలికంగా కరెంట్ పోల్స్ ఏర్పాటు చేసి విద్యుత్ దీపాలు అమర్చాలని, జాతర ప్రాంతంలోని మట్టి రోడ్లపై దుమ్ము రాకుండా స్ప్రింకర్ ద్వారా నీటిని చల్లే ఏర్పాట్లు చేయాలని అన్నారు.
కరీంనగర్ నగరానికి అనుకుని ఉన్న రేకుర్తి శివారులో గల జాతర ప్రాంతంలో జాతర జరిగే రోజుల్లో ఎస్సారెస్పీ కాలువ ద్వారా నీరు విడుదల చేయాలనన్నారు. ఫైర్ ఇంజన్ అందుబాటులో ఉంచాలని, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని తెలిపారు. జాతర జరిగే రోజుల్లో 108 వాహనం, మందులు, డాక్టర్లు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, మెడికల్ క్యాంపులు నిర్వహించాలని తెలిపారు. పోలీస్, రెవెన్యూ, విద్యుత్, రోడ్లు భవనాలు, ఇరిగేషన్, మున్సిపల్ తదితర శాఖ అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. జాతర సమయాల్లో భక్తులకోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. జాతరలో ఆపదమిత్ర వాలంటీర్ల సేవలు ఉపయోగించుకోవాలని తెలిపారు.
- జిల్లాలో 21 చోట్ల సమ్మక్క జాతర
- పోలీస్ బందోబస్తు ఏర్పాటు..
- పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం
కరీంనగర్ జిల్లాలో 21 చోట్ల సమ్మక్క జాతర జరుగుతుందని, జిల్లాలో ముఖ్యంగా రేకుర్తి, హుజురాబాద్, కేశవపట్నం, వీణవంక, జూపాక, చల్లూరు, చింతకుంట, హౌసింగ్ బోర్డ్ కాలనీలలో జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. అందుకు తగిన విధంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. జాతర జరిగే ప్రాంతాల్లో పార్కింగ్ కు ప్రత్యేక స్థలం కేటాయించాలని సూచించారు. ముఖ్యంగా మెడికల్, ఫైర్ అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటూ, అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్ బాబు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎన్.సుప్రియ, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ రాజు, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.