చర్చ, రామగిరి: సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగరేణి సంస్థ రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్టు ఏరియాల ఆధ్వర్యంలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు లు హాజరైనారు.
వేడుకల్లో భాగంగా జి.యం.కార్యాలయంలో రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకర రావు సింగరేణి పతాకావిష్కరణ చేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ
సింగరేణి సంస్థ తెలంగాణలోనే ముఖ్య భూమిక పోషిస్తుందని, ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి జీవనోపాధి కల్పిస్తుందని అన్నారు. అంతేకాకుండా పరిసర ప్రాంతాల ప్రజల కోసం అనేక సామాజిక సేవా, పర్యావరణ హిత కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువత కోసం వివిధ విభాగాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాల నిమిత్తం బొగ్గును వెలికి తీసి సరఫరా చేయడంతో పాటు, థర్మల్, సోలార్ విద్యుత్ కూడా ఉత్పత్తి చేయడం జరుగుతుందన్నారు.ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, సింగరేణి సంస్థ వివిధ రకాల వ్యాపార విస్తరణ లో ముందుకు సాగుతోందని తెలిపారు.అందరికి సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.తదుపరి ఏరియాలో ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికైన అధికారులను, ఉద్యోగులను ఘనంగా సన్మానించారు.అంతేకాకుండా వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు, జానపద, సినిమా గీతాలపై నృత్యాలను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.తదుపరి సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏరియాలో మహిళలకు నిర్వహించిన వివిధ ఆటల పోటీల, వెల్ బేబీ షో పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ వేడుకల్లో ప్రాతినిధ్య సంఘం ఏరియా వైస్ ప్రెసిడెంట్ కోట రవీందర్ రెడ్డి, ఏరియా అధికారుల సంఘం అధ్యక్షుడు కోల శ్రీనివాస్, సేవా అధ్యక్షురాలు అలివేణి సుధాకరరావు, ఎస్వోటుజిఎంలు యం.రామ్మోహన్, బి.సత్యనారాయణ, ఏరియా ఇంజినీర్ సుధాకర్ రెడ్డి, ప్రాజెక్ట్ అధికారులు ప్రవీణ్ వి ఫాంటింగ్, జే.రాజశేఖర్, విభాగాధిపతులు రాజేంద్ర కుమార్, సుదర్శనం, బి.వి. సత్య నారాయణ, మురళి కృష్ణ, రాజారెడ్డి, జనార్ధనరెడ్డి, రాజేశ్వరి, వివిధ గనుల, విభాగాల అధిపతులు, అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు, సేవా సభ్యులు పాల్గొన్నారు.