చర్చ,గోదావరిఖని : రజకులపై అనుచిత వాక్యలు చేస్తే సహించం..
- ఇళ్లముందు చాకిరేవు పెడతాం..
- రామగుండం కార్పోరేషన్ రజక సంక్షేమ సంఘం నేతల హెచ్చరిక.
తమ కులాన్ని అవమానించిన కాంగ్రెస్ నేత క్షమాపణ చెప్పాలని రామగుండం రజక సంక్షేమ సంఘం నేతలు డిమాండ్ చేశారు.రామగుండం కార్పోరేషన్ పరిదిలో అక్రమ కూల్చివేతలపై బీఆర్ఎస్ నేత కౌశికహరి వ్యాఖ్యల నేపధ్యంలో యుగేందర్ అనే కాంగ్రెస్ నేత మాట్లాడుతూ నీవు చాకలి సదువు చదువుకున్నావా…. అంటూ వ్యాఖ్యానించారని ఆరోపించారు. దీనిపై భగ్గుమన్న రజక సంఘం నాయకులు మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రజకులను కించపరిచే విధంగా కాంగ్రెస్ నాయకుడు యుగేందర్ సోషల్ మీడియాలో మాట్లాడిన తీరుపై రజకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రజక జాతికి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమను సమాజంలోని అందరూ ఇంటి ఆడబిడ్డల్లా గౌరవిస్తారని గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతలు మమ్మల్ని అవమానించడం సరికాదన్నారు.మీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఇదేనా అంటూ ప్రశ్నించారు. వీర నారి చాకలి ఐలమ్మ స్పూర్తితో తమ జాతిలోనూ ఉన్నత విద్యను అభ్యసించిన వారెందరో ఉన్నారని గుర్తుచేసారు. చాకలి వాళ్లకు చదువు రాకూడదా …!అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో సంఘం అధ్యక్షులు బండి లక్ష్మణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ దేవయ్య, రాగుల రవీందర్, పైడి రాజయ్య, బిజిగిరి వెంకటరాజం, మామిడి కుమార్, పైడిపల్లి శ్రీనివాస్, మామిడి పోశం, మామిడి మహేందర్, ఎలా బోతారం సదానందం, పొన్నం సారయ్య, నగునూరు రాజేశం, సురేష్ తదితరులు ఉన్నారు.