చర్చ, కరీంనగర్ : 2025 నేర సమీక్షా సమావేశం…జిల్లాలో తగ్గిన నేరాలు.

- 14% క్షీణతతో రికార్డు.!
- ఫ్రెండ్లీ, విజిబుల్ పోలీసింగ్ ద్వారా పెరిగిన ప్రజల నమ్మకం…
- డ్రగ్స్ రహిత జిల్లా దిశగా అడుగులు..
- గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం…
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల స్నేహపూర్వక విధానం మరియు పోలీసుల పారదర్శక పనితీరు విధానం వలన ప్రజలలో పోలీసులపై విశ్వాసం పెరిగిందని, జిల్లాలో గ్రామస్థాయిలో విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా విలేజ్ పోలీస్ అధికారి (VPO) వ్యవస్థ బలోపేతం చేసి శాంతిభద్రతల పర్యవేక్షణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని రాజన్న సిరిసిల్ల ఎస్పీ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్పీ నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎస్పీ యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి విద్యార్థినీ, విద్యార్థులకు మాదకద్రవ్యాల వలన కలిగే అనర్థాలపై అవగాహన కల్పించడంతో పాటుగా జిల్లాలో అవగాహనా ర్యాలీలు, 2K రన్ నిర్వహించడం జరిగిందని అన్నారు. 2025 సంవత్సరంలో మహిళా రక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతూ జిల్లా షీ.టీం విద్యాసంస్థలలో, మహిళలు పని చేసే ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమాల ద్వారా మహిళల్లో, విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడం జరిగిందని అన్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు సైతం పూర్తి స్థాయిలో పోలీస్ సేవలు విస్తరించాలనే ఉద్దేశ్యంతో జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే, మెసేజ్ యువర్ ఎస్పీ లాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వీటి ద్వారా బాధితులు, ఫిర్యాదుదారులు తమ సమస్యల పరిష్కారం కోసం నేరుగా పోలీస్ అధికారులను సంప్రదిస్తున్నారని, బాధితులకు సత్వర న్యాయం చేకూరడంతో పాటూ పోలీస్ శాఖపై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగిందని అన్నారు. 2025 సంవత్సరంలో జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గ్రామపంచాయితి ఎన్నికలు విజయవంతం పూర్తి చేసామన్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం నేరాలు (14.03%) గణనీయంగా తగ్గాయని అన్నారు.
గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదాల సంఖ్య 13.94% తగ్గాయని తెలిపారు.
- రోడ్ సేఫ్టీ, అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమం…
విద్యార్థులు, వాహనదారులను ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని రోడ్డు భద్రతపై క్రమం తప్పకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. అన్ని శాఖల సమన్వయంతో జిల్లా స్థాయి రోడ్డు భద్రత అవగాహన సమావేశం కూడా నిర్వహించామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు, ప్రమాదాల నివారణకు వాహనాల వేగాన్ని తగ్గించడానికి ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో సైన్ బోర్డ్స్, రబ్బర్ స్ట్రిప్స్ ,అప్రోచ్ రోడ్స్ వద్ద స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. - షీ టీమ్ మరియు భరోసా సిబ్బంది పాఠశాలలు, కళాశాలలు, మహిళలు పనిచేసే ప్రదేశాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వలన బాధితులు ముందుకు వచ్చి సంబంధిత నిందితులపై ఫిర్యాదులు చేయడంతో ఈ సంవత్సరంలో కేసుల సంఖ్య పెరిగిందన్నారు.
- ప్రాపర్టీ రికవరీ… 2024లో 428 ప్రాపర్టీ కేసులు నమోదు కాగా, వాటిలో 273 కేసులు చేధించి రూ.48,53,205ల విలువైన ఆస్తి రికవరీ చేయడం జరిగిందన్నారు. 2025 సంవత్సరంలో 339 ప్రాపర్టీ కేసులు నమోదు కాగా, వాటిలో 144 కేసులు చేధించి రూ. 39,53,137 విలువైన ఆస్తి రికవరీ చేయడం జరిగిందన్నారు. గత ఏడాది ప్రాపర్టీ రికవరీ శాతం 31.58% కాగా… ఈ సంవత్సరం 31.27% రికవరీ చేశామన్నారు.
- జిల్లాలో వివిధ సందర్భాలలో దొంగిలించబడిన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్స్ సిఈఐఆర్ అప్లికేషన్ ద్వార ఈ సంవత్సరం 799 మొబైల్ ఫోన్స్ గుర్తించి 611 ఫోన్స్ బాధితులకు అందజేశామని, 83% ఫోన్స్ రికవరీతో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవడం జరిగిందని, ఇప్పటివరకు జిల్లాలో మొత్తంగా 2218 ఫోన్స్ బాధితులకు అప్పగించామన్నారు.
సైబర్ నేరాలు…
అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరాలకు పాల్పడుతున్న నిందితులపై జిల్లా సైబర్ బృందం అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ చాకచక్యంగా దర్యాప్తు చేస్తున్నామని, ఫలితంగా మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఢిల్లీ తదితర రాష్ట్రాలలో సైబర్ మోసగాళ్లను అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేసామన్నారు.
సమాజంలో నేరాలకు పాల్పడిన ఎవరూ శిక్షల నుండి తప్పించుకోవద్దని, పోలీసు శాఖ, ప్రాసిక్యూషన్ విభాగం సమన్వయంతో వ్యూహాత్మకంగా విచారణలు చేపట్టి, పటిష్టమైన న్యాయ నిరూపణ ద్వారా ఈ సంవత్సరం 95 కేసులలో నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకున్నామన్నారు.
2024 సంవత్సరంలో క్లూస్ టీమ్ 175 కేసులకు గానూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 32 కేసులను, 2025 సంవత్సరంలో 104 కేసులకు గానూ 14 కేసులను చేధించి నేరస్తులను అరెస్ట్ చేశామని తెలిపారు.
మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్ (MSCD) సహయంతో 27,599 మందిని తనిఖీ చేసామని, లైవ్ స్కానర్ సహాయంతో 796 మంది అనుమానిత వ్యక్తులను, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన 41 మందిని, 757 మంది నేరస్తుల ఫింగర్ ప్రింట్స్ తీసుకుని తనిఖీ చేసామన్నారు.
రౌడీ షీట్స్… జిల్లాలో తరుచు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై మొత్తంగా 121 రౌడీ షీట్లు అమలులో ఉన్నాయని, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా పరిధిలో 2025 సంవత్సరంలో 04 పీడీ యాక్టులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. డయల్-100 కాల్ ద్వారా జిల్లాలో ఏ ప్రాంతంనుండైనా నేర సమాచారం అందుకున్న 5 నిమిషాల వ్యవధిలో బ్లూ కోల్ట్, పెట్రో కార్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని క్షేత్ర స్థాయిలో సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.
గల్ఫ్ ఛీటింగ్ కేసులు… గల్ఫ్ కు పంపిస్తానని మోసం చేసిన 38 కేసులు నమోదు చేసి 28 మందిని అరెస్ట్ చేయడం జరిగిందని, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి మొబైల్ నెంబర్ ను క్షేత్ర స్థాయిలో విస్తృత ప్రచారం చేసి గల్ఫ్ ఏజెంట్లను సంప్రదించే ముందు వారి సమాచారం కోసం ఇన్స్పెక్టర్ నెంబర్ ను సంప్రదించాల్సిందిగా అవగాహన కల్పించామన్నారు.
అధిక వడ్డీల పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై 12 కేసులు నమోదు చేసి, నిందితులకు 1,80,000/- జరిమానా విధించామన్నారు. పీడీఎస్ రైస్ అక్రమ రవాణాపై 55 కేసులు నమోదు చేసి 76 మందిని అరెస్ట్ చేసి 438 క్వింటాళ్ళ పీడీఎస్ రైస్ ను సీజ్ చేసామని తెలిపారు. గేమింగ్ యాక్ట్/ జూదంలో 44 కేసుల్లో 249 మందిపై కేసులు నమోదు చేసి రూ=4,88,060/- సీజ్ చేసామన్నారు.
మాదక ద్రవ్యాల నిర్మూలన..
2025 సంవత్సరంలో గంజాయి నిందితులపై 02 హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగిందని, మాదకద్రవ్యాల నివారణే లక్ష్యంగా జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో యాంటీ డ్రగ్ క్లబ్స్ ఏర్పాటు చేసి మాదకద్రవ్యాల వలన కలిగే అనర్థాలపై అవగాహన కల్పించామని, పెయింటింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేసామని తెలిపారు. అనుమానిత వ్యక్తుల వద్ద, గతంలో గంజాయి కేసులలో ఉన్న నిందుతుల వద్ద గంజాయి నమూనాలు గుర్తించడానికి జిల్లాలో DRUG TEST WITH URINE KITS అన్ని పోలీస్ స్టేషన్ లలో అందుబాటులోకి తీసుకువచ్చి విసృతంగా టెస్ట్ లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చేందుకు పాఠశాల, కళాశాల విద్యార్థులతో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు 5కే రన్ & 2కే ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. జిల్లాలో మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన షీ టీమ్ విద్యా సంస్థలు, బస్టాండ్లు, మహిళలు పని చేసే ప్రాంతాల్లో, బహిరంగ ప్రదేశాల్లో నిరంతరం పోకిరీలపై నిఘా ఉంచుతూ మహిళా చట్టాలపై వివిధ అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. మీ కోసం కార్యక్రమంలో భాగంగా ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో ప్రజలకు సైబర్ సెక్యూరిటీ, షీ టీమ్, రోడ్ సేఫ్టీ, గంజాయి, ఆన్లైన్ చీటింగ్లు, గుట్కా, జూదం మరియు మహిళల భద్రత, కమ్యూనిటీ పోలీసింగ్ పై అవగాహన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడానికి గ్రీవెన్స్ డే, మెసేజ్ యువర్ ఎస్పీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజల వద్ద నుండి 924 ఫిర్యాదులు స్వీకరించి చట్ట ప్రకారం న్యాయం జరిగేటట్లు చేస్తున్నామని అన్నారు. జిల్లాలో నిరంతరం విధులు నిర్వర్తించే పోలీస్ సిబ్బంది ఆరోగ్యం పట్ల ఆశ్రద్ధ వహించకూడదని మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి జిల్లాలోని పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ఆపదలో ఉన్న ప్రజల ప్రాణాలను కాపాడడం పోలీస్ శాఖ కర్తవ్యమని భావించి వరదల్లో చిక్కుకున్న ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించామని, జిల్లాలో ఈ సంవత్సరం భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న సుమారు 38 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా గంభీరావుపేట మండలం నర్మాలలోని ఎగువ మానేరు జలాశయం వద్ద పశువుల కాపర్లు చిక్కుకపోగా వెంటనే స్పందించి, సంబంధిత శాఖల సమన్వయంతో తక్షణ సహాయక చర్యలు చేపట్టామని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డ్రోన్ల ద్వారా ఆహార పదార్థాలు చేరవేసి, ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా 8 మందిని సురక్షితంగా రక్షించగలిగామన్నారు. గంభీరావుపేట మండలం లింగన్నపేట, మల్లారెడ్డిపేట గ్రామాలలో వరదల్లో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను ఎన్డీఆరెఫ్, ఎస్డీఆరెఫ్ బృందాలతో సహాయక చర్యలు చేపట్టి సురక్షితంగా రక్షించామన్నారు.
గ్రామపంచాయతి ఎన్నికలు… మూడు విడుతల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇన్సిడెంట్ ఫ్రీ అండ్ ఫెయిర్ గా అన్ని ప్రభుత్వ శాఖల సహకారంతో స్వేచ్చగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు సుమారు 900 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పకడ్బందీగా ప్రణాళికలు సిద్దం చేసి విజయవంతంగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసామన్నారు. ఎన్నికల సందర్భంగా 13కేసులు నామోదు కాగా, 29,05,720 రూ..లను సీజ్ చేశామని, 102 మద్యం కేసుల్లో 1577.36 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నామని అన్నారు.
భవిష్యత్ ప్రణాళికలు... జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించి, ఆరోగ్య పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన మందులను అందజేస్తామని తెలిపారు. జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణకు మద్దతుగా ప్రధాన కూడళ్లలో, జిల్లా సరిహద్దుల్లో ANPR /సీసీటీవీ కెమెరాల సంఖ్యను పెంచుతూ, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, అదనంగా, వాహన తనిఖీలు నిర్వహించే పోలీసు సిబ్బందికి బాడీ వోర్న్ కెమెరాలు అందించి, పారదర్శకతను పెంచడంతో పాటు అనూహ్య సంఘటనలను నివారించే చర్యలు చేపడుతామని తెలిపారు. జిల్లాను మాదక ద్రవ్యరహితంగా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, గంజాయి సేవించే వారిని గుర్తించి, కౌన్సెలింగ్ కార్యక్రమాల ద్వారా మార్గనిర్దేశం చేస్తూ, విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దొంగతనాల కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, జిల్లాలో నిఘాను మరింత కట్టుదిట్టం చేస్తున్నట్లు, అన్ని కోణాల నుంచి కేసులను సమగ్రంగా దర్యాప్తు చేసి, కేసులను ఛేదిస్తూ, 100 శాతం రికవరీ సాధిస్తామని అన్నారు. సాంకేతికతను వినియోగిస్తూ సైబర్ నేరాలు, క్లూస్ టీమ్‌లు, CCTNS పై పోలీసు సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి, దర్యాప్తులను వేగవంతం చేసి నేరాలపై పూర్తి స్థాయిలో నియంత్రణ సాధిస్తామని అన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగిందని, జిల్లాలో బ్లాక్ స్పాట్లను గుర్తించి, R&B, మున్సిపాలిటీలు మరియు సంబంధిత శాఖల సమన్వయంతో అవసరమైన చర్యలు చేపడుతామన్నారు.