News & Views

చర్చ, సుజాతనగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పహానిలో ఉన్న పేరు ఎలా మాయమైంది?

  • ఆర్టీఐ అడిగితే ‘రికార్డులే లేవు’ అంటున్న అధికారులు
  • సుజాతనగర్ తహసీల్దార్ కార్యాలయంపై తీవ్ర ఆరోపణలు

సుజాతనగర్ మండల పరిధిలోని నిమ్మలగూడెం గ్రామంలో ఉన్న వారసత్వపు పట్టా భూమికి సంబంధించిన పహానిల విషయంలో అధికారుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఆర్టీఐ చట్టం–2005 ప్రకారం సమాచారం కోరినా, పొంతన లేని సమాధానాలతో బాధితుడిని అయోమయానికి గురి చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆర్సీ నెంబర్ RTI/B1148/2022 (తేదీ: 04-11-2025) ప్రకారం సుజాతనగర్ మండల తహసీల్దార్ కార్యాలయానికి దాఖలైన ఆర్టీఐకి వచ్చిన సమాచారం ప్రకారం, సర్వే నెంబర్ 1073 ఊ లోని పట్టా భూమి 1950 నుంచి 1986–87 వరకు శనగ స్వామి అనే వ్యక్తి పేరుతో పహానిల్లో నమోదు అయి ఉంది. అయితే, 1987–88 మరియు 1988–89 సంవత్సరాల పహానిల్లో ఆ పేరు అకస్మాత్తుగా కనిపించకుండా పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఈ నేపథ్యంలో “పహానిలో ఉన్న పేరు తర్వాత ఎలా తొలగించబడింది?” అనే అంశంపై బాధితులు ఆర్టీఐ యాక్ట్–2005 ద్వారా స్పష్టమైన వివరణ కోరగా, సుజాతనగర్ మండల ఎమ్మార్వో కార్యాలయం నుంచి “ఆ సంవత్సరాలకు సంబంధించిన పహానిలు మా కార్యాలయంలో లభించడం లేదు. మీరు వచ్చి రికార్డులు పరిశీలించుకోవచ్చు” అంటూ ఒక మెమో మాత్రమే పంపించారు.

అంతేకాక, అసలు అవసరమైన పహాని నకలులను జిరాక్స్ రూపంలో కూడా అందించకుండా, సంబంధం లేని పత్రాలను పంపిస్తూ “ఇదే మీరు అడిగిన సమాచారం” అని పేర్కొనడం బాధితులను మరింత అయోమయానికి గురి చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఒక సంవత్సరం వరకు పహానిలో స్పష్టంగా ఉన్న పేరు, తర్వాతి సంవత్సరాల్లో ఎలా మాయమైందన్న కీలక ప్రశ్నకు మాత్రం అధికారులు సమాధానం చెప్పడంలేదని బాధితుల వాపోతున్నారు.

ఈ వ్యవహారంతో న్యాయం కోసం ఎవరిని ఆశ్రయించాలో తెలియక బాధితుడు చివరకు పత్రిక విలేఖరిని ఆశ్రయించి తన గోడును వెళ్లబోసుకున్నాడు. అధికారుల తప్పిదాల వల్ల అమాయకులు కోర్టులు, మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతూ విసిగిపోతూ కన్నీళ్లు మున్నీరవుతున్నాయి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ అంశంపై అర్జీదారుడు శనగ వెంకట లక్ష్మణరావు, తన భూమికి సంబంధించిన పహానిల్లో జరిగిన మార్పులపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరుతున్నాడు.

రికార్డులు “కనిపించడం లేదు” అని లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వడం అధికారుల అలసత్వానికి, బాధ్యతారాహిత్యానికి నిదర్శనం అని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, పహానిల మాయపై స్పష్టత తీసుకువచ్చి బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.