News & Views

చర్చ, కరీంనగర్ : గ్రామాభివృద్ధే లక్ష్యంగా, ఐక్యంగా పనిచేయండి

  • మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు

రాజకీయాలకు అతీతంగా, ఐక్యమత్యంతో నాగారం గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్. విద్యాసాగర్ రావు పిలుపునిచ్చారు. ఇటీవల నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన తన సొంత గ్రామమైన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని నాగారం గ్రామ పాలకవర్గ సభ్యులు, బుధవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సర్పంచ్ అప్పల నాగభూషణం, ఉపసర్పంచ్ కీర్తనతో పాటు వార్డు సభ్యులు గ్రామ సమగ్ర అభివృద్ధిపై విద్యాసాగర్ రావుతో చర్చించారు. గ్రామంలోని మౌలిక సదుపాయాలు, రహదారుల పరిస్థితి, పారిశుద్ధ్య నిర్వహణతో పాటు తాగునీటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని ఆయన నూతన పాలకవర్గానికి దిశానిర్దేశం చేశారు.

రాజకీయ పార్టీలను పక్కనపెట్టి, గ్రామాభివృద్ధి కోసం అందరూ ఒక్కటిగా పనిచేయాలని, ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకమైన పాలన అందించినప్పుడే గ్రామం నిజమైన ప్రగతిని సాధిస్తుందని విద్యాసాగర్ రావు సూచించారు. గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం నూతన పాలకవర్గ సభ్యులను శాలువాలతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రమేష్, గంగయ్య, రామచంద్రం, లక్ష్మణ్, ప్రశాంత్‌లతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.