చర్చ, సిరిసిల్ల: వేడుకల పేరుతో ప్రజల భద్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు
- ఆనందోత్సాహాల మధ్య న్యూ ఇయర్ వేడుకలు శాంతియుతంగా జరుపుకుందాం.
- డిసెంబర్ 31న జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.
- మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్ , బైక్ రేసింగ్, త్రిబుల్ రైడింగ్, సైలెన్సర్ తొలగించి వాహనాలు నడుపుతే కఠిన చర్యలు.
- డీజేలు, అధిక శబ్ద పరికరాలపై పూర్తి నిషేధం, ఉల్లంఘిస్తే కేసులు తప్పవు.
- మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే,వాహనాల యజమానులపై, తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తాం.
- న్యూ ఇయర్ వేడుకల పేరుతో ప్రజా భద్రతకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవు: ఎస్పీ మహేష్ బి.గితే.
ఆనందోత్సాహాల మధ్య కుటుంబ సభ్యులతో కలసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే. సూచించారు. డిసెంబర్ 31న పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, వాహన తనిఖీలు నిర్వహించనున్నట్లు, నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించే ఏ కార్యక్రమమైనా తప్పనిసరిగా పోలీసుల నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా నిబంధనలకు విరుద్ధంగా డీజేలు,అధిక శబ్దం వచ్చే బాక్స్‌లు ఏర్పాటు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని హెచ్చరించారు.
పోలీసుల సూచనలు..
డిసెంబర్ 31న టపాసులు, మైకులు వినియోగించి ప్రజలను ఇబ్బంది పెట్టితే కఠిన చర్యలు తీసుకుంటామని, డిసెంబర్ 31న జిల్లావ్యాప్తంగా డీజేలు పూర్తిగా నిషేదించామని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తే డీజేలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం, వాహనాల సైలెన్సర్ తొలగించి శబ్ద కాలుష్యం సృష్టించినా, త్రిబుల్ రైడింగ్ చేయడం లాంటి చర్యలకు పాల్పడితే కేసులతో పాటు జైలు శిక్ష విధించబడుతుందనిఅన్నారు. ఇళ్లు, ప్రైవేట్ ఆస్తులు, వీధి దీపాలపై రాళ్లు వేయడం, ఆస్తులను ధ్వంసం చేయడం, మహిళలను ఇబ్బంది పెట్టడం లేదా అసభ్యంగా ప్రవర్తిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నూతన సంవత్సర వేడుకలలో నిషేధిత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల విక్రయం లేదా వినియోగానికి పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో, ప్రభుత్వ స్థలాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే, వారికి వాహనాలు ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తామని, వారి వల్ల ప్రమాదం జరిగితే సంరక్షకులపై కూడా చర్యలు ఉంటాయన్నారు. నిబంధనల ఉల్లంఘనలపై ప్రజలు వెంటనే డయల్ 100 కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించి కఠిన చర్యలు తీసుకుంటారని తెలిపారు.