చర్చ, కరీంనగర్ : జిల్లాలో యూరియా కొరత లేదు – కలెక్టర్ పమేలా సత్పతి
జిల్లాకు అవసరమైన యూరియా ఎరువులు సరిపడా నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.
కరీంనగర్ జిల్లాలో సోమవారం వరకు 4246 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాకు 22,368 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా ప్రతి సేల్ కౌంటర్ వద్ద షామియానా, త్రాగు నీటి సౌకర్యం కల్పించాలన్నారు. ఉదయం 6.00 గంటల నుండి కౌంటర్ వద్ద యూరియా సేల్స్ ప్రారంభించాలని ఆదేశించారు.
ప్రస్తుతం జిల్లాలో ఉన్న యూరియా నిల్వలు మొక్క జొన్న సాగుకు సరిపోతాయని, అవసరాన్ని బట్టి, సరఫరా లోపం రాకుండా ఎరువులు అందుతున్నాయని రైతులకు భరోసానిచ్చారు. యూరియా పంపిణీపై సంబంధిత అధికారులు, వ్యవసాయ శాఖ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు విక్రయించడం వంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు ఎవరైనా యూరియా సరఫరాలో సమస్యలు ఎదుర్కొంటే సమీప వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. అవసరానికి మించి యూరియా కొనుగోలు చేయకుండా, శాస్త్రీయ పద్ధతిలో వినియోగించాలని రైతులను కలెక్టర్ కోరారు.