News & Views

చర్చ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలంలో ఆధ్యాత్మిక వైభవం – గోదావరిలో హంస వాహనంపై శ్రీ సీతారామచంద్ర స్వామివారి తెప్పోత్సవం

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో వైకుంఠ ముక్కోటి ఏకాదశి అధ్యయన మహోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం నిర్వహించిన శ్రీ స్వామివారి తెప్పోత్సవం భక్తుల హృదయాలను పరవశింపజేసింది. దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచల క్షేత్రంలో పవిత్ర గౌతమీ గోదావరి నదీ తీరంలో జరిగిన ఈ జలవిహార మహోత్సవం ఆధ్యాత్మిక శోభతో పాటు సంప్రదాయ వైభవాన్ని ఉట్టిపడేలా చేసింది.
ఉదయం నుంచే ఆలయంలో ఉత్సవ వాతావరణం నెలకొనగా, ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణలు, భాజా–భజంత్రీల మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సీతారామచంద్ర స్వామివారిని పల్లకీలో ఊరేగింపుగా గోదావరి నదీ తీరానికి తీసుకువచ్చారు. మార్గమధ్యంలో భక్తులు “శ్రీరామ జయరామ”, “జగదభిరామ జానకిరామ” నామస్మరణలతో జయజయధ్వానాలు చేశారు.
గోదావరి ఘాట్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికను పుణ్యజలాలతో సంప్రోక్షణ చేసి, ఆలయ అర్చకులు గోదావరి నదికి చీర, పసుపు, కుంకుమలతో హారతి సమర్పించారు. అనంతరం విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించిన హంస వాహనంపై శ్రీ సీతారామచంద్ర స్వామివారు సీతాదేవి, లక్ష్మణ స్వామి సమేతంగా గోదావరిలో జలవిహారానికి బయలుదేరారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నాదం, భక్తుల నామస్మరణల నడుమ స్వామివారు విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అపురూప దృశ్యాన్ని తిలకించిన భక్తజనం భక్తి పరవశత్వానికి లోనయ్యారు.
తెప్పోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బాణాసంచా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గోదావరి జలాలపై ప్రతిబింబించిన రంగురంగుల వెలుగులు వేడుకకు మరింత శోభను చేకూర్చాయి. నదీ తీరంలో కుటుంబ సమేతంగా కూర్చొని భక్తులు ఈ ఆధ్యాత్మిక మహోత్సవాన్ని కనులారా తిలకించారు. అశేష భక్తజన సందోహంతో గోదావరి పరివాహక ప్రాంతం జనసంద్రంగా మారింది.
గోదావరి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు వేడుక వైభవాన్ని మరింత పెంచాయి. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. భద్రత, రవాణా నియంత్రణ, విద్యుత్ సరఫరా, పారిశుధ్యం, వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి సారించి ఉత్సవాన్ని ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో ముగించారు.
రేపు జరగనున్న వైకుంఠ ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ అధికారులు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని దర్శన క్యూలు, బ్యారికేడ్లు, తాగునీటి సౌకర్యాలు, వైద్య శిబిరాలు, పారిశుధ్య ఏర్పాట్లు, భద్రతా చర్యలను పటిష్టంగా అమలు చేసినట్లు పేర్కొన్నారు. భక్తులు క్రమశిక్షణ పాటిస్తూ అధికారులకు సహకరించి వైకుంఠ ద్వార దర్శనం ద్వారా భద్రాద్రి రాముడి కృపకు పాత్రుల కావాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఐటీడీఏ పీవో రాహుల్, ఏఎస్పీ విక్రాంత్ సింగ్, దేవస్థానం ఈవో ఈ.ఓ. దామోదర్ రావు, భద్రాచలం సర్పంచ్ పూనెం కృష్ణ దొర తదితరులు పాల్గొన్నారు.