చర్చ: కమాన్పూర్: పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ రామగుండం ఏసిపి మడత రమేష్
కమాన్పూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను బుధవారం రామగుండం ఏసిపి మడత రమేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏసిపి స్టేషన్ పనితీరును సమగ్రంగా పరిశీలిస్తూ, పోలీసు యంత్రాంగం ప్రజలకు అందిస్తున్న సేవల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించారు.
తనిఖీ లో భాగంగా స్టేషన్లోని రికార్డులు, కేసుల నమోదు విధానం, సిబ్బంది హాజరు వివరాలు, ఆయుధాగార నిర్వహణ, సీసీటీవీ పర్యవేక్షణ, శుభ్రత ప్రమాణాలను ఏసిపి క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా పెండింగ్ కేసుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకొని, విచారణల్లో వేగం పెంచాలని సూచించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం చేయకుండా స్పందించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ, చట్ట పరిరక్షణలో ఎలాంటి రాజీ పడకూడదని సిబ్బందికి హితవు పలికారు. శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని, నేర నియంత్రణకు గస్తీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. సాంకేతిక వసతుల వినియోగాన్ని పెంచి, ఆధారాల సేకరణలో ఖచ్చితత్వం పాటించాలని పేర్కొన్నారు.ఏసిపి తనిఖీ సమయంలో టూ టౌన్ సీఐ ప్రసాద్ రావు, ఎస్సై కొట్టే ప్రసాద్ , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.