News & Views

చర్చ, జగిత్యాల: నాణ్యమైన విద్యాబోధనకై కృషి సాగాలి… _జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ రాజాగౌడ్

జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతీ ఉపాధ్యాయుడు అంకిత భావంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్ రాజా గౌడ్ పిలుపునిచ్చారు.
స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్. టి. యూ) జగిత్యాల జిల్లా శాఖ రూపొందించిన నూతన సంవత్సర టేబుల్ క్యాలెండర్ ను జిల్లా అదనపు కలెక్టర్ రాజగౌడ్, జిల్లా విద్యాధికారి రాముతో కలిసి ఆవిష్కరించారు. ఉపాధ్యాయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాజగౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నత విద్యార్హతలు, శిక్షణ, బోధనా నైపుణ్యాలు కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని , పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలు ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నారని, వారి భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని తెలిపారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు.
పదవ తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడంతో పాటు, జగిత్యాల జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి పాఠశాల ఒక ఉత్తమ విద్యా కేంద్రంగా మారాలనే దిశగా పనిచేయాలని కోరారు.
అలాగే కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం పోషన్ అభియాన్ అమలులో జగిత్యాల జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధించడం గర్వకారణం అని పేర్కొన్నారు. ఇది జిల్లా విద్యా శాఖ సమిష్టి కృషికి నిదర్శనమని జిల్లా విద్యాధికారి కె. రాము గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అనంతరం
జిల్లా విద్యాధికారి రాము మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న విద్యా సంస్కరణలను సమర్థవంతంగా అమలు చేస్తూ, విద్యార్థుల విద్యా ప్రమాణాలను మరింత పెంచేందుకు జిల్లా విద్యా శాఖ కృషి చేస్తోందని చెప్పారు. ఉపాధ్యాయుల సహకారంతో జగిత్యాల జిల్లా విద్యా రంగంలో మరిన్ని విజయాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి మచ్చ శంకర్, జిల్లా అధ్యక్షులు బైరం హరికిరణ్, ప్రధాన కార్యదర్శి పాలెపు శివరామకృష్ణ, ఆర్థిక కార్యదర్శి మేకల ప్రవీణ్, జిల్లా బాధ్యులు బండి శ్రీనివాస్, గుండెల నరేష్, పూర్ణచందర్, తిరుపతి చారి, నంద్యానాయక్ అలాగే వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిరిపురం రాజేష్, విద్యామని కృష్ణ, కొండెరి గంగాధర్, జమీరొద్దీన్, అన్నం మహేష్, తిరుపతి రెడ్డి, మురళి తదితరులు ఉన్నారు.