చర్చ, కమాన్ పూర్: ఎప్పటి కైనా కార్యకర్త పార్టీకి సుప్రీం
- తప్పు చేస్తే నిలదీసేది కార్యకర్తనే
- నాడు పదేళ్లు నేడు రెండేళ్లలో ఏం చేయని దుద్దిళ్ల శ్రీధర్
- ఎప్పుడు పైసలే గెలుస్తాయంటే మనం పోటీ చేయడమెందుకు
- కమాన్‌పూర్‌లో నాయకత్వం మరింత పటిష్టంగా పనిచేయాలి
- మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
ఎప్పటికైనా కార్యకర్తనే పార్టీకి సుప్రీం అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. సోమవారం కమాన్‌పూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు కార్యకర్తలంటే నాయకులు భయపడేవారని, కానీ ఈనాడు కార్యకర్తలే భయపడే స్థాయికి వచ్చిందని, గెలిచే వరకు మాత్రమే ఆదరించి ఆ తర్వాత మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. వంద మందిలో పదిమంది తప్పు చేసే వారు ఉంటారని, అలాంటి వారిని మిగిలిన తొంబై మంది కంట్రోల్ చేయాలే కానీ అలా జరుగడం లేదన్నారు. కానీ నిక్కాస్సైన కార్యకర్త మాత్రం మా నాయకుడు నిలబడాలే మా పార్టీ నిలబడాలని ప్రశ్నిస్తాడని ఆయన అన్నారు. అయితే మంథని నియోజకవర్గంలోమాత్రం ఏండ్ల తరబడి జెండా మోస్తూ పార్టీ కోసం పని చేస్తూ వెంట తిరిగే నాయకులకు పదవులు రావాలని దుద్దిళ్ల శ్రీధర్ కోరుకోడని అన్నారు. మంథని ఎమ్మెల్యే మంత్రిగా అయిన తర్వాత మొదటి సారి మంథనిలో జరిగిన ర్యాలీలో మాట్లాడిన తీరు ఇందుకు నిదర్శనమన్నారు. ఈసారి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్కరే పోటీలో ఉండాలని, ప్రతి ఊరిలో తాము చెప్పిన వారినే గెలిపించుకోవాలని అన్నాడని, గతంలో గ్రామాల్లో ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ పడితే బీఆర్ఎస్ అభ్యర్థులు సర్పంచ్‌లుగా గెలిచారని, ఈసారి అలా జరుగకూడదంటూ చెప్పితే అందరూ సంతోషపడుతూ చప్పట్లు కొట్టారన్నారు. కానీ మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఏ గ్రామాల్లోనైనా ఒక్కరినే నిలబెట్టారా అని ఆయన ప్రశ్నించారు. అంటే తమ వెంట తిరిగే నాయకులకు పదవి రావడం ఇష్టం లేదనేది తేటతెల్లమైందన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మంథని ఎమ్మెల్యే శ్రీధర్ తన సొంత ఊరిలో ఏకగ్రీవం చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు పోటీ పడి లక్షల్లో ఖర్చు చేసి ఓడిపోయారని ఆయన వాపోయారు. అయితే ప్రతీ సారి పైసలు పెడితేనే గెలుస్తారని అనుకోవడం అవివేకమని, అలా అయితే ఇక మనలాంటోళ్లు పోటీ చేయడం ఎందుకనిప్రశ్నించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుకు వేయి ఇచ్చి పది నుంచి యాభై లక్షలు ఇచ్చి లీడర్లు కొన్నారని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుకు ఐదు వేలు కూడా ఇచ్చే అవకాశం ఉందన్నారు. అధికారంలో లేనప్పుడే వంద కోట్లు పెట్టిన మంథని ఎమ్మెల్యే ఇప్పడు హైదరాబాద్‌లో నాలుగు ఆఫీసులు పెట్టిదోపిడి చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో పైసలు గెలుస్తామని అనుకుంటే ఎమ్మెల్యేగా పోటీ చేయడం దేనికన్నారు. కమాన్‌పూర్ మండలం ఒకప్పుడు బీఆర్ఎస్కు కంచుకోటగా ఉండేదని, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు కనిపించకపోవడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, మంథని ఎమ్మెల్యే రెండేళ్ల కాలంలో మండలానికి ఏం అభివృద్ది చేశారని ఆలోచన చేయాలన్నారు. 2009 నుంచి 2014 వరకు మంథని ఎమ్మెల్యే మంత్రిగా ఉండి మండల అభివృద్దికి తట్టెడు మట్టి పోయలేదన్నారు. కానీ తాను పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో అనేక అభివృధ్ది పనులు చేశామని, ఆదివరహస్వామి దేవాలయాన్ని ఎండోమెంట్లో చేర్చడం మొదలు చుట్టూ రహదారి నిర్మాణం చేశామని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడి నాయకత్వం మరింత పటిష్టంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో సమన్వయంతో కలిసి కట్టుగా మండల పార్టీ అధ్యక్షుడిగా పని చేసిన తాటికొండ శంకర్‌నే మళ్లీ మండల పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిస్తామని తెలిపారు. ఇప్పటికైనా నాయకులు, కార్యకర్తలు ఎన్నికల్లో పైసలే పని చేస్తాయనే ఆలోచన చేయకుండా ప్రజల వెంట ఉండాలని, వారిలో మార్పు తీసుకురావాలని ఆయన ఈసందర్బంగా పిలుపునిచ్చారు.