News & Views

చర్చ ,సింగరేణి : సింగరేణిలో ‘ప్లే డే’ రద్దు ప్రతిపాదనపై వస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం

చర్చ ,సింగరేణి :
గత నెల జనవరి 24, 25 తేదీల్లో గౌరవనీయులు శ్రీ జి. కిషన్ రెడ్డి గారు, కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రివర్యులు, సింగరేణిలో సమీక్ష సమావేశం నిమిత్తం కొత్తగూడెంలో పర్యటించారు.

సింగరేణిలో టెండర్ల ప్రక్రియలో జరుగుతున్న అనేక అవకతవకలపై వచ్చిన కథనాలు, అలాగే సింగరేణికి రావలసిన వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకపోవడం వల్ల సంస్థ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుండటం, దీనివల్ల కార్మికుల భవిష్యత్తు అనిశ్చితంగా మారడం వంటి అంశాలపై సమగ్రంగా సమీక్షించేందుకు కేంద్ర మంత్రివర్యులు ఈ పర్యటన చేపట్టారు.

ఈ సందర్భంగా వారు కార్మికుల్లో సింగరేణి భవిష్యత్తుపై విశ్వాసాన్ని పెంపొందిస్తూ, సంస్థ మనుగడకు మరియు అభివృద్ధికి అవసరమైన పలు కీలక సూచనలు చేశారు. అయితే ప్లే డేలను తగ్గించాలన్నా, లేదా ఆర్టీసీ–రైల్వే తరహాలో రొటేషన్ విధానంలో పనిచేస్తే ఆర్థిక భారం తగ్గుతుందని వారు ఎక్కడా ప్రస్తావించలేదని స్పష్టంగా తెలియజేస్తున్నాము.

కానీ కొన్ని పత్రికలు అవగాహనలేని విధంగా, అనాలోచితంగా, ప్లే డే రద్దు ప్రతిపాదన’ అంటూ ప్రచారాన్ని చేయడం విచారకరం. ఈ తప్పుడు వార్తలను సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ ABKMS–BMS తీవ్రంగా ఖండిస్తోంది.

మంత్రివర్యుల పర్యటనలో భాగంగా పద్మావతి ఖనిని సందర్శించగా, ఆరోజు సుమారు 300 మందికి పైగా కార్మికులు ప్లే డే అలవెన్సులతో విధులు నిర్వహించిన విషయం కార్మికులు గమనించగలరని విజ్ఞప్తి. ఇది ప్లే డే రద్దు అనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని నిరూపిస్తుంది.
మంత్రివర్యులు సింగరేణికి రావలసిన సుమారు రూ. 51 వేల కోట్ల బకాయిలను (ప్రధానంగా ట్రాన్స్కో, జెన్కో వంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుండి) వెంటనే వసూలు చేస్తే, సింగరేణి ఆర్థికంగా బలోపేతం అవుతుందని సూచించారు. అదేవిధంగా,
సింగరేణికి శాశ్వత CMD నియామకం,
నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి,
కార్మికుల సంక్షేమం కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వంటి వైద్య సౌకర్యాలు,
రాజకీయ ఒత్తిళ్లకు లోబడి అధికారులు పనిచేయకూడదని,
టెండర్లలో పారదర్శకత పాటించాలని,
కార్మికులు, కార్మిక సంఘాలు, అధికారులు, డైరెక్టర్లు అందరూ ఒక కుటుంబంలా కలిసి సింగరేణి భవిష్యత్తు కోసం ఐక్యంగా పనిచేయాలి అని స్పష్టంగా సూచించారు.
అంతేగాని, ప్లే డేలను తగ్గించాలి లేదా రద్దు చేయాలి అనే అంశాన్ని మంత్రివర్యులు ఎక్కడా ప్రస్తావించలేదని మరోసారి స్పష్టంగా తెలియజేస్తూ, ఈ అబద్ధపు వార్తలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.

పి. మాధవ నాయక్
కార్యదర్శి, ABKMS–BMS & జేబీసీసీ సభ్యులు
టి.ఎస్. పవన్ కుమార్
స్టాండింగ్ కమిటీ సభ్యులు
యాదగిరి సత్తయ్య
యూనియన్ అధ్యక్షులు
అప్పాని శ్రీనివాస్
వర్కింగ్ ప్రెసిడెంట్
యాతపతి సారంగపాణి
ప్రధాన కార్యదర్శి
సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (ABKMS–BMS)