News & Views

చర్చ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :  ఏజెన్సీ ప్రాంతాల్లోని యువత చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి : కలెక్టర్ జితేష్.వి.పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు

చర్చ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :

చర్ల మండలంలో పోలీసుల ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన క్రీడా మైదానంలో సిఎం కప్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్,ఎస్పీ

చర్ల మండలం పూజారి గూడెం శివార్లలో SCA ( స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్) నిధుల సహకారంతో చర్ల పోలీసుల ఆధ్వర్యంలో నూతనంగా నిర్మితమైన క్రీడా మైదానంలో సిఎం కప్ ప్రారంభోత్సవానికి శుక్రవారం నాడు జిల్లా కలెక్టర్ జితేష్.వి.పాటిల్,ఎస్పీ రోహిత్ రాజు లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.చర్ల మండలంలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని యువత క్రీడల్లో రాణించాలనే లక్ష్యంతో 75 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించబడిన క్రీడామైదానంలో ఈ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి.భద్రాచలం,దుమ్ముగూడెం,చర్ల మండలాల్లోని యువ క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొననున్నారు.కబడ్డీ,ఖోఖో,వాలీబాల్,అథ్లెటిక్స్,క్యారమ్స్,బ్యాడ్మింటన్ పోటీలలో భద్రాచలం డివిజన్లోని క్రీడాకారులు ఉత్సాహంగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.ముందుగా జిల్లా కలెక్టర్ జితేష్.వి.పాటిల్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లోని యువత చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని అన్నారు.క్రీడల పట్ల మక్కువ ఉన్న ఏజెన్సీ ప్రాంత యువత తమ ప్రతిభను చాటుకోవడానికి ఈ క్రీడా పోటీలు మంచి అవకాశం అని తెలిపారు. ఇప్పటికే భద్రాచలం,దుమ్ముగూడెం,చర్ల మండలాల్లోని ఎంతోమంది క్రీడాకారులు రాష్ట్రస్థాయి,జాతీయస్థాయి,అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో తమ సత్తాను చాటుకుంటున్నారని,ఇంకా ఎంతో మంది క్రీడాకారులు ఈ ప్రాంతం నుండి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.చర్ల సిఐ రాజు వర్మ కృషితోనే ఈ క్రీడామైదానం త్వరగా క్రీడాకారులకు అందుబాటులోకి వచ్చిందని, ఆయన కృషికి ధన్యవాదాలు తెలియజేశారు.

అనంతరం ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే యువత అన్ని రంగాల్లో రాణించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలియజేశారు.జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే మారుమూల గ్రామాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని,ఇక ముందు కూడా ఏజెన్సీ ప్రాంతవాసుల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు.ఆదివాసీ ప్రజలకు విద్య,వైద్యం,రవాణా సౌకర్యాలను అందించడంలో ఇతర శాఖల సమన్వయంతో పోలీస్ అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. ముఖ్యంగా భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో చర్ల సీఐ రాజువర్మ నిరంతర కృషితోనే ఈ మైదానం త్వరితగతిన మన ముందుకు వచ్చిందని తెలిపారు.భద్రాచలం డివిజన్లోని క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత స్థాయికి చేరాలని కోరారు.ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక కానున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ సెక్రటరీ పరందామయ్య రెడ్డి,చర్ల సిఐ రాజువర్మ,ఎస్సైలు నర్సిరెడ్డి,కేశవ మరియు ఇతర అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.