News & Views

చర్చ, మణుగూరు : మర్మమెరగని “మరణం

 

చర్చ , మణుగూరు :

*మర్మమెరగని “మరణం*”-

*రూ.3 లక్షల అప్పుకి 30 లక్షలు రాసిస్తారా*…???-

*శవాన్ని పార్శిల్ కట్టి రాజస్థాన్ పంపారా*…!!???

*న్యాయం చేయాలని ముగ్గురు పిల్లలతో వచ్చి ఎస్పీని వేడుకున్న బాధితురాలు*

*ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణం*

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సమితి సింగారం గ్రామంలో ఒక కుటుంబం భయాందోళనల మధ్య రోజులు గడుపుతోంది. భర్త మరణం చుట్టూ ఉన్న అనుమానాలు… ఆస్తి వివాదం… బెదిరింపులతో…
ఒక మహిళ తన ముగ్గురు చిన్నపిల్లలతో కలిసి సాగిస్తున్న పోరాటం పలువురిని కలచివేసింది. తన భర్త మరణం వెనుక ఉన్న అసలు నిజాలను వెలికి తీయాలని ఆమె సోమవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజును ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటూ తన ముగ్గురు చిన్నారులతో బతుకు పోరాటం చేస్తున్న ఆమెకు న్యాయం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజస్థాన్ రాష్ట్రంలోని దోల్పూర్ గ్రామానికి చెందిన రామనాథ్ (36) ఉపాధి కోసం దశాబ్దం క్రితం కుటుంబంతో కలిసి తెలంగాణకు వచ్చాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సమితి సింగారం గ్రామంలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ జీవనం సాగించేవాడు. కానీ కుటుంబం సాదాసీదా జీవితం గడుపుతున్న సమయంలోనే అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయని రామనాథ్ భార్య గుడ్డి ఆరోపిస్తోంది.
బాధితురాలి వాదన ప్రకారం, 2025 నవంబర్ నెలలో తాను భర్తతో కలిసి స్వగ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్న సమయంలో గ్రామానికి చెందిన వడ్డీ వ్యాపారం చేసే ఒక మహిళ తన భర్తను తమ వెంట రానీయకుండా అడ్డుకున్నట్లు చెబుతోంది. అలాంటి పరిస్థితుల వల్ల తాను ఒంటరిగా రాజస్థాన్ వెళ్లాల్సి వచ్చిందని, తనకు తెలియకుండానే పది రోజుల తర్వాత భర్త మరణించాడని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా భర్త మృతి విషయం కూడా తనకు వెంటనే తెలియజేయకుండా, మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారని ఆరోపించింది.
ఈ సంఘటనల వల్ల భర్త మరణం సహజం కాదనే అనుమానాలు తలెత్తాయని ఆమె చెబుతోంది. మరణానికి ముందు జరిగిన పరిణామాలు, తన భర్తను వెంట రానీయకుండా అడ్డుకోవడం, మరణ వార్తను ఆలస్యంగా చెప్పడం వంటి అంశాలు లోతుగా విచారించాలని ఆమె జిల్లా ఎస్పీని కోరింది. తన భర్త మరణానంతరం మరో వివాదం మొదలైందని బాధితురాలు చెబుతోంది. వడ్డీ వ్యాపారం చేసే మహిళ తమ ఇంటిని రూ.20 లక్షలకు కొనుగోలు చేశామని చెబుతూ ఇల్లు ఖాళీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారని ఆమె ఆరోపిస్తోంది. అయితే భర్త జీవించి ఉన్న సమయంలో ఇల్లు అమ్మకం గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని, ఎటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగలేదని ఆమె స్పష్టం చేసింది. తనకు తెలిసిన మేరకు తన భర్త వడ్డీ వ్యాపారం చేసే మహిళ వద్ద నుంచి కేవలం రూ.3 లక్షలు మాత్రమే అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించారని తెలిపింది. అయినప్పటికీ రూ.20 లక్షలకు ఇల్లు కొనుగోలు చేశామని చెబుతూ నకిలీ పత్రాలు చూపిస్తున్నారని ఆమె ఆరోపించింది. ఈ పత్రాల ఆధారంగా తమ కుటుంబాన్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొంది.
అంతేకాకుండా ఇల్లు ఖాళీ చేయకపోతే చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని, కొంతమంది వ్యక్తులు కలిసి తరచూ ఇంటికి వచ్చి మానసికంగా వేధిస్తున్నారని బాధితురాలు తెలిపింది. ఈ పరిస్థితుల్లో తన చిన్నపిల్లల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసు రక్షణ కల్పించాలని ఆమె వినతిపత్రంలో కోరింది.
భర్త మరణానికి గల అసలు కారణాలను వెలికితీసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అక్రమంగా తయారు చేసినట్లు అనుమానిస్తున్న పత్రాలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఆమె అధికారులను అభ్యర్థించింది. అవసరమైతే సంబంధిత ఆధారాలు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నానని కూడా తెలిపింది. ఈ ఘటన గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు భర్త మరణంపై అనుమానాలు, మరోవైపు ఆస్తి వివాదం, బెదిరింపుల ఆరోపణలు ఒకేసారి వెలుగులోకి రావడంతో స్థానికులు కూడా తీక్షణంగా ఈ ఘటనను గమనిస్తున్నారు. ప్రస్తుతం పోలీసు అధికారులు ఫిర్యాదును స్వీకరించి ప్రాథమిక వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఈ ఘటన వెనుక ఉన్న నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ఇన్ని ఆటంకాల మధ్య ఒక తల్లి తన ముగ్గురు పిల్లలతో ఎలా జీవనం సాగిస్తుందో కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.