News & Views

చర్చ సింగరేణి: సింగరేణిలో సమ్మె సైరన్ – సమస్యలు పరిష్కరించకుంటే స్తంభింపజేస్తామని హెచ్చరిక_

22 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు సిద్ధంగా ఉండాలని ఏఐటీయూసీ పిలుపు

 

_చర్చ సింగరేణి

సింగరేణిలో సమ్మె సైరన్ మోగనుందని, కార్మికుల సహనానికి హద్దు దాటిందని ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య హెచ్చరించారు. సమస్యలు పరిష్కరించకుంటే సింగరేణిని స్తంభింపజేస్తామని, యాజమాన్యం మొండివైఖరి వీడకపోతే సమ్మె తప్పదని అన్నారు. 22 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు కార్మికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

సోమవారం ఉదయం పీవీకే-5 గనిలో నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల సహనాన్ని యాజమాన్యం బలహీనతగా భావించవద్దని, ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేయడం వల్ల కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని అన్నారు.

సింగరేణిలో కార్మికులు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ వాటి పరిష్కారంపై యాజమాన్యం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని విమర్శించారు. కార్మిక సంక్షేమం, సంస్థ భవిష్యత్ అభివృద్ధి, యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన కంటే రాజకీయ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సింగరేణి మనుగడకే ప్రమాదం ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న మెడికల్ బోర్డు కేసులు, అలియాస్ పేర్ల మార్పులు, పెర్క్స్‌పై ఇన్‌కమ్ ట్యాక్స్ తొలగింపు, సొంత ఇంటి స్థలాల కేటాయింపు, డిపెండెంట్ ఉద్యోగాల వంటి అంశాలపై అనేకసార్లు చర్చలు జరిగినప్పటికీ ఆచరణలో పురోగతి కనిపించడం లేదన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని మండిపడ్డారు.

మెడికల్ ఫిట్ అయిన డిపెండెంట్లకు నియామక ఉత్తర్వులు జారీ కావడం ఏఐటీయూసీ చేపట్టిన నిరంతర పోరాట ఫలితమేనని పేర్కొన్నారు. పోరాటం ద్వారానే ఫలితాలు సాధ్యమవుతాయని, కార్మికులు ఐక్యంగా ఉంటే మరిన్ని సమస్యలకు పరిష్కారం సాధించగలమని విశ్వాసం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన సుమారు రూ.56 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొత్త కోల్ బ్లాకుల కేటాయింపు, కొత్త బొగ్గు గనుల ప్రారంభం, సంస్థ విస్తరణ, భవిష్యత్ తరాలకు ఉద్యోగ అవకాశాల కల్పనపై తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను పెంచాలని ఒత్తిడి చేస్తూ సంస్థ విస్తరణ చర్యలను నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు.

యూనియన్‌తో జరిగిన అధికారిక సమావేశాల్లో అంగీకరించిన డిమాండ్లు ఇప్పటికీ అమలు కాకపోవడం వెనుక రాజకీయ జోక్యమే కారణమని ఆరోపించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం కొనసాగిస్తే సింగరేణి వ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతమవుతాయని హెచ్చరించారు.

కార్మిక హక్కులు, ఉద్యోగ భద్రత, సింగరేణి భవిష్యత్ పరిరక్షణ కోసం జరుగుతున్న ఈ పోరాటానికి అన్ని కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు మద్దతు తెలపాలని కోరారు. అవసరమైతే నిరవధిక సమ్మెకు కూడా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి వి. మల్లికార్జున్ రావు, కేంద్ర ప్రచార కార్యదర్శి వీరస్వామి, వైస్ ప్రెసిడెంట్లు కత్తెర్ల రాములు, సహాయ కార్యదర్శి గట్టయ్య, ఆఫీస్ బేరర్లు సందబోయిన శ్రీనివాస్, ఎస్. నాగేశ్వరరావు, హుమాయూన్, పిట్ కార్యదర్శులు భూక్యా రమేష్, మధుకృష్ణ, కమల్, సీనియర్ నాయకులు మండల రాజేశ్వరరావు, అసిస్టెంట్ పిట్ కార్యదర్శి సందీప్, మైనింగ్ స్టాఫ్ ఇంచార్జ్ సాయి పవన్, సేఫ్టీ కమిటీ మెంబర్ రాంచందర్, నారాయణ, లాల్ సింగ్, కుమార్ రావు, సంజీవ్, మోహన్, సురేందర్ రెడ్డి, కనకయ్య, మహేష్, ముబారక్, గణేష్, సునీల్, నరేష్, విక్రమ్, సహాదేవ్, సుధీర్, బాబురావు, మదనయ్య, కోటేశ్వరరావు, సుధాకర్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.