News & Views

చర్చ, ములుగు: పోలింగ్ నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పరిశీలన జరపాలి.

మైక్రో అబ్జర్వర్ల శిక్షణ తరగతుల్లో కీలక సూచనలు చేసిన

సాధారణ పరిశీలకుడు (ఎన్నికలు)   ప్రశాంత్ కుమార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆయిల్ఫడ్ హైదరాబాద్.

డిసెంబర్ 06 ములుగు.

గ్రామ పంచాయతీ  ఎన్నికలలో కీలకమైన ఓటింగ్ ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలన జరపాలని సాధారణ పరిశీలకుడు (ఎన్నికలు)   ప్రశాంత్ కుమార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

ఆయిల్ ఫెడ్, హైదరాబాద్  మైక్రో అబ్జర్వర్లకు సూచించారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను సూక్ష్మ స్థాయిలో పరిశీలన జరిపేందుకు వీలుగా నియమించబడిన మైక్రో అబ్జర్వర్లకు శనివారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో శిక్షణ తరగతులు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి సాధారణ పరిశీలకుడు (ఎన్నికలు)   ప్రశాంత్ కుమార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆయిల్ ఫెడ్, హైదరాబాద్ విచ్చేసి మైక్రో అబ్జర్వర్లకు కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ, సూక్ష్మ పరిశీలకుల ర్యాండమైజేషన్ ప్రక్రియను అనుసరిస్తూ మైక్రో అబ్జర్వర్లకు ఆయా ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలలో పరిశీలన బాధ్యతలు కేటాయించడం జరుగుతుందన్నారు. మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ కు సంబంధించిన ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన ఏర్పర్చుకోవాలని, అప్పుడే పోలింగ్ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించగల్గుతారని అన్నారు. ముఖ్యంగా పోలింగ్ కు ముందు రోజు ఉదయం 6.00 గంటల సమయానికే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కు చేరుకొని పోలింగ్ సిబ్బందికి అందించే సామాగ్రి సక్రమంగా అందినదా ?లేదా ? అనేది పరిశీలించాలని, అనంతరం పోలింగ్ సిబ్బందితో కలిసి పోలింగ్ స్టేషన్లకు చేరుకోవాలని సూచించారు.  పోలింగ్ ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా, పూర్తి పారదర్శకంగా జరుగుతోందా లేదా అన్నది నిశిత పరిశీలన చేయాలని, గమనించిన అంశాలను జనరల్ అబ్జర్వర్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవా అన్నది గమనించాలని, సీక్రెట్ పోలింగ్ కంపార్ట్మెంట్ సరిగానే ఏర్పాటు చేశారా అన్నది పరిశీలించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, ఇతర అధికారులు నిర్వర్తిసున్న విధులను గమనించాలని, టెండర్, ఛాలెంజ్ ఓటింగ్ లు జరిగితే వాటి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. అయితే పోలింగ్ ప్రక్రియ తీరుతెన్నులను పరిశీలించడం వరకే మైక్రో అబ్జర్వర్ల బాధ్యత అని, ఎక్కడ కూడా పోలింగ్ విధుల్లో జోక్యం చేసుకోకూడదని ఆయన హితవు పలికారు. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుండి పూర్తయ్యేంత వరకు అన్ని అంశాలను గమనిస్తూ, ఎప్పటికప్పుడు వాటిని జనరల్ అబ్జర్వర్ దృష్టికి తీసుకెళ్లాలని, ఓటింగ్ గోప్యతను కాపాడే విధంగా మైకో అబ్జర్వర్లు బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు.  సమస్యాత్మక కేంద్రాలలో మరింత ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, పోలింగ్ కేంద్రం బయట, పరిసర ప్రాంతాల్లోనూ జరిగే అంశాలను గమనిస్తూ జాగరూకతతో వ్యవహరించాలని అన్నారు. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లను అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లు ప్రభావితం చేయకుండా నిఘా ఉంచాలని, ఎన్నికల సంఘం గుర్తింపు కార్డులు కలిగిన వారు, ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న వారు మినహా, ఇతరులెవరిని పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లేందుకు అనుమతి లేదన్నారు. కరదీపిక లోని అంశాలను పూర్తి స్థాయిలో ఆకళింపు చేసుకుని తదనుగుణంగా విధులు నిర్వహించాలని మైక్రో అబ్జర్వర్లకు సూచించారు.

ఈ శిక్షణ తరగతుల్లో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ జయ ప్రకాష్,  మాస్టర్ ట్రైనర్లు, మైక్రో అబ్జర్వర్లు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.