News & Views

చర్చ కొత్తగూడెం : బఫర్ జోన్‌లో తప్పిన భారీ ప్రమాదం షాపింగ్ మాల్ నిర్లక్ష్యం – తృటిలో తప్పిన ప్రాణనష్టం

 

చర్చ కొత్తగూడెం :

చుంచుపల్లి మండలం విద్యానగర్ పంచాయతీ పరిధిలో బఫర్ జోన్‌లో అక్రమంగా నిర్మించిన బహుళ అంతస్తుల కట్టడాల నాణ్యత మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. స్వల్ప గాలివానకే ఒక ప్రముఖ షాపింగ్ మాల్‌కు చెందిన కాంపౌండ్ గోడతో పాటు ప్రచార హోర్డింగ్ కూలి పార్క్ చేసిన కారుపై పడింది.
అదృష్టవశాత్తు ఘటన సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే కారు పూర్తిగా దెబ్బతింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “చావు తప్పి కన్ను లొట్ట పోయింది” అన్నట్టుగా పరిస్థితి ఉండగా, ఎప్పుడైనా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
ఇక షాపింగ్ మాల్ సిబ్బంది హడావిడి, ఆలస్యం కారణంగా ఘటనపై స్పష్టత లేకుండా పోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బఫర్ జోన్‌లో అనుమతుల్లేకుండా నిర్మాణాలు జరుగుతున్నా అధికార యంత్రాంగం కనీసం స్పందించకపోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నాణ్యత లేని అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.