News & Views

చర్చ సింగరేణి : సింగరేణి 137 ఏళ్ల చరిత్రలో అత్యంత దయనీయ స్థితి: మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణ

ఓబీ టెండర్లలో రూ.1600 కోట్ల బొగ్గు మాయం: కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

చర్చ సింగరేణి భద్రాద్రి కొత్తగూడెం:

సింగరేణి 137 ఏళ్ల చరిత్రలో అత్యంత దయనీయ స్థితికి చేరిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల వల్ల సింగరేణి నిర్వీర్యమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఓపెన్ కాస్ట్ ఓవర్ బర్డెన్ ఓబీ టెండర్లలో భారీ అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సైట్ విజిట్ పేరుతో ఓబీ టెండర్లలో గోల్‌మాల్ జరుగుతోందని, దాదాపు *40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని* సంచలన ఆరోపణలు చేశారు.

*ఆరోపణల సారాంశం:*

1. *బొగ్గు మాయం:* 4 మిలియన్ టన్నుల బొగ్గు మాయంపై చర్చ జరుగుతోందని, రూ.1600 కోట్ల విలువైన బొగ్గు మాయ చేసి పన్నులు ఎలా కట్టారని ప్రశ్నించారు. తవ్వని బొగ్గుకు, పన్నులు ఎలా, ఎందుకు కట్టారని, డీఎంఎఫ్టీ నిధులు ఎలా ఇచ్చారని నిలదీశారు.

2. *టెండర్ల అవినీతి:* ఓబీ టెండర్లలో అక్రమాలకు మంత్రి భట్టి విక్రమార్క పాత్ర కీలకమని, సీఎం రేవంత్ రెడ్డి బంధువుల శోధ కంపెనీ ఓబీ అక్రమాల్లో పాల్గొందని ఆరోపించారు.

3. *ఉత్పత్తి మాయ:* బొగ్గు కుంభకోణం బట్టబయలవడంతో ఇప్పుడు ఉత్పత్తి తక్కువ చూపిస్తూ ఓల్డ్ స్టాక్ రవాణా చేస్తున్నట్లు మరో మాయ జరుగుతోందన్నారు. ఉత్పత్తిపై గొప్పలకు పోయి అసలుకే ఎసరు పెట్టారని, నాటి సీఎండీ, మంత్రి భట్టి మాయాజాలం ఇదంతా అని మండిపడ్డారు.

4. *ఆర్థిక అనిశ్చితి:* లాభాల్లో ఉన్న సింగరేణిని కుంభకోణాల గనిగా మార్చారని, లాభాల సింగరేణి 4 వేల కోట్ల ఓవర్‌డ్రాఫ్ట్‌కు ఎందుకు దిగజారిందని ప్రశ్నించారు. సీఎం రేవంత్ ఫుట్‌బాల్ సోకుల కోసం సింగరేణి నిధులు వాడుతున్నారని ఆరోపించారు.

5. *కేంద్ర వాటా:* కేంద్రానికి సింగరేణిలో 49 శాతం వాటా ఉందని, కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి పాత్రపై అనుమానాలున్నాయని, బొగ్గు స్కాంపై కేంద్ర బొగ్గు మంత్రి చర్యలు ఏవీ లేవని, విచారణ ఎందుకు చేయటం లేదని డిమాండ్ చేశారు.

6. *కార్మికుల సమస్యలు:* సింగరేణి థర్మల్ ప్రాజెక్ట్ నిర్వీర్యమైందని, మెడికల్ బోర్డు లేక అనారోగ్యం పాలైన కార్మికులకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. కేసీఆర్ హయాంలో వారసత్వ ఉద్యోగాలు ఇస్తే, ఉన్న ఉద్యోగులను ఉడగొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం యత్నిస్తోందని, సింగరేణిలో రాజకీయ జోక్యం విపరీతమైందని విమర్శించారు.

*నినాదం:*
చివరగా “కాంగ్రెస్ హటావో… సింగరేణి బచావో” అంటూ నినదించారు.